మెదక్​లో దారుణం.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది..


మెదక్ జిల్లాలో  ప్రేమోన్మాది దారుణ ఘటన  వెలుగుచూసింది.  ప్రేమోన్మాది ..డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలే కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం ( నవంబర్​ 4) ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజికి వచ్చిన ఓ యువతిపై చేతన్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

అప్రమత్తమైన యువతి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంది. యువతి చేతికి తీవ్ర గాయం కాగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు చేతన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.